‘చేరువైనా దూరమైనా ఆనందమేనా!!?’ ఎంత అందమైన భావన! నువ్వు దగ్గరగా ఉంటే నిన్నే చూస్తుండిపోయాను, తెలవారకముందే నను విడిచి వెళిపోతే మన మధుర క్షణాల మగత నిద్రలో ఉండిపోయాను. ఈ రెండు స్థితులలోనూ నా మది ఆనందాన్నే పొందుతుంది, నా ‘ఆనందా’న్ని పొందుతుంది. అంతగా ఇష్టపడింది మరి ‘రూప’ - ‘నా ఈ స్థితికి కారణమైన ఆ నువ్వు నువ్వేనా, నా నువ్వేనా...!’ అని అడుగుతుంది కదా మరి. ‘నువ్వేనా – నా నువ్వేనా?’ ఇంతకన్నా పొసేస్సివ్ గా చెప్పడం కష్టం అనిపిస్తుంది.
‘సూర్యుడల్లె సూది గుచ్చే సుప్రభాతమేనా! మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా!!’, ‘నా ఉదయపు తొలి ఆలోచన నువ్వేనా, నా సుప్రభాతం నువ్వేనా!!? నీ చూపులతోనే మాట్లాడతావే, అది ఏ రాగం? మౌనరాగమా!’, రూప పాత్రలోకి ప్రవేశించి పలికించిన మాటలలగా అనిపిస్తాయి, అనిపించడం కాదు, అయన పరకాయ ప్రవేశం చేసేసారు అంతే. లేకపోతే ‘నువ్వేనా, నా నువ్వేనా!’ అని ఊరుకోకుండా, ‘నాకు నువ్వేనా!’ అని ఎలా అనగలగుతారు?
‘తేనెటీగ లాగా కుట్టి తీపి మంట రేపుతావు, పువ్వు లాంటి గుండెలోన దారమల్లె దాగుతావు’, ఈ ఉపమానాలు ఇంకెవరికి సాధ్యం? ‘నేను లత – నా పువ్వుని ( హృదయాన్ని) నీ ప్రేమతో కుట్టి తియ్యని మంట రేపుతావ్, అలా నాలో ప్రేమ పుట్టించి వెళ్లిపోయావ్ అనుకుంటూ ఉంటాను, కానీ నా హృదయ కుసుమంలో దారం లాగా దాగుంది నువ్వేనా, నా నువ్వేనా!’, నిజంగా రూప అదృష్టవంతురాలు, తన మనసు చెప్పలేని క్లిష్ట స్థితిని సులువు మాటలతో చెప్పగలిగే కవి దొరికినందుకు.
‘కోయిలల్లె వచ్చి యేదో కొత్త పాట నేర్పుతావు, కొమ్మ గొంతులోన గుండె కొట్టుకుంటే నవ్వుతావు’, ‘నా చెంతకి నువ్వే వస్తావు, కొత్త వాతావరణంతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేసి నవ్వేస్తావు, న్యాయమేనా!?’ అని రూప అడగడంలో కొంచెమైనా తప్పు లేదు అనిపిస్తుంది.
‘మేఘమల్లె సాగి వచ్చి దాహమేదో పెంచుతావు, నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు’. ‘నా మనసులో మాట చెప్పినందుకు ధన్యవాదాలు’ అని రూప చెప్పబోతుంటే, ‘ఆగమ్మా, ఇవతల నీ ఆనంద్ మనసులోని ఈ భావాల్ని కూడ విను’ అని అయన పలికించిన ఆ మౌన భావాలే ఇవి. ‘నా మీద ప్రేమ ఉంది, కానీ నాకు కనబడనీయవు, ఏంటి నువ్వు, నాకు ఉండేది ఈ కలలు కన్నీరేనా?’. ‘రూప అంటే ఏంటి’ అంటే, నాలుగు వాక్యాల్లో చెప్పేసారు.
‘మసక ఎన్నెలల్లె నీవు ఇసక తిన్నె చేరుతావు, గసగసాల కౌగిలింత గుసగుసల్లె మారుతావు’ , ఉపమానాలతోనే సరిపెట్టలేదు గురువర్యులు, తెలుగు లో ప్రయోగాలు కూడా లభ్యం ఇందులో. అయన మాటల్లోనే వినాలంటే, “ఏమీ లేదు, ప్రయోగం చేశా... ‘సగం సగం’ ని తిప్పా... ‘గసం గసం’ అయ్యింది... అది కాస్తా ‘గసగసాలు’ అయ్యింది”. (శేఖర్ గారి అనుభవాల నుంచి). తెలుగు మీద అంత అధికారికంగా ప్రయోగం చేయగలిగేంత సాన్నిహిత్యం (తెలుగుతో) ఎవరికీ ఉంటుంది చెప్పండి, తెలుగు భాష మీద ఉన్న అభిమానంతో జాతీయ అవార్డ్ ని కూడా వద్దనుకున్న వేటూరి గారికి తప్ప. గురువు గారు, మీకు నా నమస్సుమాంజలి.
(నాకు తెలిసిన పరిజ్ఞానం తో రాసాను, ఏమైనా దోషాలుంటే మన్నించండి)
సాహిత్యం...
నువ్వేనా... నా నువ్వేనా!
నువ్వేనా... నాకు నువ్వేనా!!?
సూర్యుడల్లె సూది గుచ్చే సుప్రభాతమేనా!?
మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా!?
చేరువైనా.. దూరమైనా.. ఆనందమేనా!! ||2||
ఆనందమేనా... ఆనందమేనా...!!
||నువ్వేనా||
మేఘమల్లె సాగి వచ్చి దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు
కలలేనా... కన్నీరేనా..!!
తేనెటీగ లాగ కుట్టి తీపి మంట రేపుతావు
పువ్వు లాంటి గుండెలోన దారమల్లె దాగుతావు
నేనేనా... నీ రూపేనా..!!?
||చేరువైనా... దూరమైనా..||
||నువ్వేనా||
కోయిలల్లె వచ్చి యేదో కొత్త పాట నేర్పుతావు
కొమ్మ గొంతులోన గుండె కొట్టుకుంటే నవ్వుతావు
యే రాగం... యిది యే తాళం...!!?
మసక ఎన్నెలల్లె నీవు ఇసక తిన్నె చేరుతావు
గసగసాల కౌగిలింత గుసగుసల్లె మారుతావు
ప్రేమంటే నీ ప్రేమేనా..!
||చేరువైనా... దూరమైనా..||
||నువ్వేనా||